హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని ఎంఎల్ సి కవిత తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలుగు విశ్వ విద్యాలయంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందని, బతుకమ్మ పండుగ అత్యంత ప్రాచీనమైన పండుగ అని, తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారు.
పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే, మనం మరచిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలు, మళ్లీ బాషలో చేరే అవకాశం ఉంటుందని కవిత తెలియజేశారు. తెలుగు మరింత పరిపుష్టం అయ్యే అవకాశం ఉందని, దీని మీద ఆలోచించాల్సిందిగా వైస్ ఛాన్సిలర్ ను కోరుతున్నామన్నారు.
బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారని, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నామని కవిత తెలియజేశారు. వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగను కాపాడుకున్నామని, తెలంగాణ ఆడబిడ్డలందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.