Thursday, December 26, 2024

అమలుకాని హామీలిచ్చి మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌దే:ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

ఎన్నికలకు ముందు మహిళలకు ఎన్నో హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. క్రిస్మస్ వేడుకలతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రముఖ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మిపథకం కింద రూ.2500, కళ్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చావంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు అయినందున నెలకు రూ.2 వేల చొప్పున 24 వేల రూపాయలు వెంటనే మహిళలకు చెల్లించాలని డిమాండ్ చేశారు.మెదక్ చర్చి వేడుకల్లో పాల్గొన్న సిఎం క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్‌లు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. గత సిఎం కెసిఆర్ హయంలో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇచ్చి అన్ని వర్గాల వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పథకాలు ఇవ్వకపోగా పాత పథకాలను ఆపేసిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని మండిడ్డారు. ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రంలో 40 శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఆశ చూపించి మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్దిచెప్పే రోజులు వస్తాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్‌డిఎస్‌ఎల్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెదక్, నిజామాబాద్, కోరుట్లలో గల షుగర్ ప్యాక్టరీలను ఎందుకు తెరిపించలేకపోయారని ప్రశ్నించారు. రైతు భరోసాలో కటింగ్ పెడితే సహించేది లేదని, ఏవేవో షరతులు పెట్టి రైతు భరోసాను ఎగవేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో కనీసం 30 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయక కంది, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పసుపు, చెరుకు రైతులకు కనీస మద్దతు ధర కల్పించక రైతులను మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సిలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్‌తోపాటు పలు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News