Wednesday, January 22, 2025

ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌సి కవిత బాధితురాలు మాత్రమే…నిందితురాలు కాదు!

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశంతోనే ఎంఎల్‌సి కవితను ఇడి అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమేనని, నిందితురాలు కాదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి మోదీ కుట్ర పన్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ మహిళా నేతలు గొంగిడి సునీత, హరిప్రియ నాయక్‌లతో సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. కెసిఆర్, కేజ్రీవాల్‌లను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బిజెపి కుట్ర పన్నిందని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే సాక్షిగా ఉన్న కవిత పేరును నిందితురాలిగా చేర్చారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే బిజెపి కవితను ఇడి ద్వారా అరెస్ట్ చేయించిందన్నారు. అప్రూవర్లుగా మారి ఏది చెప్పినా చెల్లుతుందా? అని అడిగారు. మోదీకి డబ్బులు ఇచ్చామని ఎవరైనా చెబితే ఆయనను కూడా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి ఒక్కటై బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కవిత పోరాట యోధురాలని, కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది ఇడి కేసు కాదు- మోడీ కేసు : గొంగిడి సునీత
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ప్రధాని మోడీ తమ పార్టీపై ఎలా నిందలు వేస్తారని మాజీ ఎంఎల్‌ఎ గొంగిడి సునీత ప్రశ్నించారు. కెసిఆర్‌ను లొంగదీసుకునేందుకు ఆడబిడ్డ అని కూడా చూడకుండా కవితను మోడీ అరెస్టు చేయించారని ఆరోపించారు. నేరస్థులు భారతీయ జనతా పార్టీలో చేరితే పరమ పవిత్రులు అవుతారా..? అని నిలదీశారు. కవిత రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సిఎం కెసిఆర్ కుమార్తె అని రాజకీయ దురుద్దేశంతో ప్రస్తావించారని ఆక్షేపించారు. బిజెపి దురుద్ధేశం లోకానికి తెలియడానికి ఈ ఒక్క అంశం చాలని వ్యాఖ్యానించారు. ఇది ఇడి కేసు కాదని, మోడీ కేసు అని పేర్కొన్నారు. మోడీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచించారు. దేశాన్ని దోచుకున్నోళ్లకు చేయూతనిచ్చిందే మోడీ అని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడం మోడీకి అలవాటు అని విమర్శించారు. వందల ప్రాణాలను బలి తీసుకున్న మోడీకి కవితను జైలుకు పంపించడం చిన్న విషయమని అన్నారు. వ్యతిరేకించిన వారిని ఇబ్బంది పెట్టడమే మోడీ నైజమని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను కబలించే కుట్ర జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ వచ్చే ముందు ఇడి, సిబిఐ వస్తాయని విమర్శించారు. మోడీ పాలన దేశం భ్రష్టు పట్టిందని అన్నారు. మహిళలను ఉద్యమం వైపు మళ్లించింది కవితే అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవితది ప్రత్యేక స్థానమని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News