బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీపై సిబిఐ దాఖలు చేసిన కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జులై 5వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను ఇడి అరెస్ట్ చేసింది. అనంతరం ఆమె జ్యుడిషియల్ కస్టడీలోభాగంగా న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. ఆ తర్వాత ఇదే కేసులో ఆమెను సిబిఐ సైతం విచారించి అరెస్టు చూపించింది. మరో వైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది కానీ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.
కవిత బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం మధ్యంతర బెయిల్ కూడా దక్కలేదు. బిఆర్‌ఎస్ పార్టీ న్యాయ విభాగం కూడా శ్రమిస్తోంది. ఇటీవల కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆమెకు బెయిల్ లభించలేదు. తనను అక్రమంగా అరెస్టు చేశారని.. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని అప్పట్లో కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు ఆమె కస్టడీని కూడా కోర్టు పొడిగిస్తూ వస్తోంది. ఈ కేసులో కవితే ప్రధాన నిందితురాలని, ఆమెకు బెయిల్ వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఇడి వాదిస్తూ చేస్తూ వస్తోంది. కాగా ఈ మేరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. కాగా ఈ కేసులో 100 కోట్ల ముడుపులు చేతులు మారాయని, అందులో కీలక సూత్రధారి, పాత్రధారి కవితేనంటూ ఇడి, సిబిఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చార్జిషీట్లలోనూ ఇదే విషయం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వారు సుదీర్ఘ కాలంగా జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనష్ సిసోడియా అరెస్ట్ అయి ఏడాది దాటిపోయింది.