హైదర్ గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆదివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ అనారోగ్యానికి గురవడంతో ఆయనను పరామర్శించి అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించాలని భారత జాగృతి తరఫున స్పీకర్ కి వినతిపత్రం ఇచ్చామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీ లోపు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. గతంలో భారత జాగృతి పోరాటంతో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని.. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని అన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ కి అయోధ్య రామజన్మ భూమి కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. రాముడు అందరివాడు..ఏదొక రోజు అయోధ్యని సందర్శిస్తామని ఆమె చెప్పారు.