Thursday, March 6, 2025

బిసి రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలి:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో బిసిల రిజర్వేషన్లు పెంపునకు అసెంబ్లీలో మూడు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బిసిలకు రిజర్వేషన్లను పెంచడానికి మూడు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టాల్సిందేనని, లేదంటే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వానికి సూచించారు. ఇది గంభీరమైన అంశం అని, కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలని తెలిపారు. గురువారం నాడు తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ…. విద్య, ఉద్యోగ రంగాల్లో బిసిల రిజర్వేషన్ అంశం కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని, కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం మాత్రమే రాష్ట్ర జాబితాలో ఉంటుందని గుర్తు చేశారు. అయితే, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా, ఉద్యోగ రంగాలను,

రాష్ట్ర జాబితాలో ఉండే స్థానిక సంస్థల వేర్వేరుగా చేసి రిజర్వేషన్లను కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర జాబితాలో ఉన్న కారణంగా పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కెసిఆర్ రాష్ట్రస్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రస్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తోందని ధ్వజమెత్తారు. మూడు ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర చేస్తుందని ఆరోపించారు. మూడు అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయవివాదం తలెత్తుతుందని, జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓడించాయి
బిజెపి, కాంగ్రెస్ పార్టీల కుటిల రాజకీయ క్రీడలో బిసి బిడ్డలు బలవుతున్నారని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీలు గెలిచి, ప్రజాస్వామ్యం ఒడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓడించాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిసియేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, దాంతో పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయని, కాబట్టి పోటీలో ఉన్న బిసి అభ్యర్థి గెలవలేదని అన్నారు. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బిసిలందరూ ఐక్యమవ్వాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయని తెలిపారు. కాబట్టి చట్టసభల్లో కూడా బిసిలకు రిజర్వేషన్లు ఉండాలని, బిసి రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బిసికే పార్టీలు టికెట్ ఇచ్చేవి అని వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయని బలంగా చెప్పడానికి కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికనే నిదర్శనమని తేల్చిచెప్పారు. ఆ రెండు పార్టీల తీరు బిసిల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News