భూమి అనేది ఓ ఎమోషన్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కోసం తీసుకొచ్చిన భూభారతి చట్టం భూ హారతి అవుతుందని భూభారతి బిల్లుపై ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. శాసన మండలిలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ ‘బిఆర్‌ఎస్ ప్రభు త్వంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూమోసాలు పోయాయి. రైతుకు రక్షణ కవచం ధరణి. అలాంటి ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదు. రాష్ట్ర ప్రజలు, రైతులు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారని నమ్మకం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఒక తిరోగమన చర్య. ఆ చట్టం కచ్చితంగా భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది. ఆ భూమాత పోర్టల్ భవిష్యత్తులో భూమేతకే దారి తీస్తుంది. బిఆర్‌ఎస్ అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు భావిస్తున్నారు. భూమి కోసం ప్రాణమిచ్చేది ఒకరు సైనికుడు అయితే, మరొకరు రైతు. ధరణిలో ఏమైనా సమస్యలు కనిపిస్తే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలి. కానీ ఆ వ్యవస్థనే రద్దు చేయడం సరికాదు.
ధరణిలో కుట్ర జరిగిందని ప్రభుత్వం చెప్పడం దారుణం. తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉండగా అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నారు. మరో 17.8 లక్షల ఎకరాల భూమి వివాదాల్లో ఉంది. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20 నుంచి 25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరగాల్సి వచ్చేది. కెసిఆర్ రైతుకు మాత్రమే భూమి యాజమాన్య హక్కు ఉండేలా చేశారు. రైతుల భూమికి భద్రత కల్పించింది కెసిఆర్. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. 100 రోజుల్లో దాదాపు 35749 ఉద్యోగులు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేశారు. అనంతరం భూమి వివరాలను ధరణిలో ఎక్కించారు. ధరణి కన్నా ముందు చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణితో ప్రభుత్వ భూములను కాపాడింది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు. భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బిఆర్‌ఎస్ సర్కార్ ప్రజలకు చేరువ చేసింది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి చేయడం వల్ల పని 42 నిమిషాల్లో పూర్తయ్యేది. భూరికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగి, రాష్ట్ర సంపద పెరిగింది. మ్యాన్యువల్ పహాణీల వల్ల పలు వివాదాలు ఏర్పడేవి. ధరణి పోర్టల్ ఆ సమస్యను తీర్చింది.
భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతు బంధు అందింది. దాదాపు 66 లక్షల మందికి రైతులకు రైతు బంధు అందించాం. గతంలో పంట రుణాలు వచ్చేవి కావు. ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంటలకు లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి కల్పించాం. ధరణి పోర్టల్ ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారు. భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్ బీలో చేర్చాం. ఎంజాయ్‌మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ఎంజాయ్ మెంట్ సర్వే తేనెతుట్టెను కదిలించొద్దు. మళ్లీ 32 కాలమ్‌లతో పహాణీలను రాయడం మొదలుపెడితే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది. రైతుల మధ్య వివాదాలు తలెత్తి కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది. ఒకే సారి కాకుండా దశల వారీగా రీసర్వే చేయాలి. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్ బుక్‌లు ఉన్నాకా భూధార్ కార్డు అవసర ఏంటి ? ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు. హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారంలో ఉంది. భూభార తి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు. భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనపై వెనక్కి తగ్గాలి. కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలి’ అని ఎంఎల్‌సి కవిత అన్నారు.