సరైన దిగుబడి లేక ఇబ్బంది పడుతున్న వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధర కూడా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ రైతుల ఆందోళన మీకు కనిపించడం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారూ? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు వ్యాపారుల మోసం వల్ల రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు. పోలీసుల పహారా మధ్య వేరుశనగ కొనుగోళ్లు జరపాల్సి వస్తోందని కవిత అన్నారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పారు. వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరకు వేరుశనగను అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మేల్కొని రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడమే కాకుండా మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమీషన్ దారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్టులపై 31న రౌండ్ టేబుల్ సమావేశం : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేయడానికి ఈనెల 31న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ గారు నిర్మించిన కీలక ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నదని, కాబట్టి ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అభిప్రాయపడింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తిప్పికొడతామని స్పష్టం చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ అన్ని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, ఆ మేరకు తీర్మానాలను ఆమోదిస్తామని తెలిపింది. కేసీఆర్ ప్రారంభించారనే అక్కసుతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిలిపివేసింది. సీతారామ ఎత్తిపోతలను ప్రచార ఆర్భాటం కోసం అధికారికంగా ప్రారంభించి ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల టెండర్ల విషయంలో ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు.
కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని పెండింగ్ పనులను చేపట్టడం లేదు. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల సమర్థ వినియోగం మీదనే స్పష్టత లేదు. కృష్ణా. గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులతో పాటు కృష్ణాలో న్యాయమైన నీటి వాటాల సాధన కోసం కొత్త ట్రిబ్యునల్ సాధించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. దానిపై కాంగ్రెస్ పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తోందని, ఈ అన్ని అంశాలను ప్రజలకు తేటతెల్లం చేసేలా రౌండ్ టేబుల్ సమావేశంలో సమగ్రంగా చర్చించాలని నిర్ణయించింది.