ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన జరుగుతున్నదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్న చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ కంచ గచ్చిబౌలిలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ దృశ్యగీతాన్ని శుక్రవారం నగరంలో సహచర ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ…కెసిఆర్ హయాంలో తెలంగాణలో 7.7 శాతం అడవులు పెరిగాయనీ, ఇప్పుడు రాష్ట్రంలో చెట్లను పీకేసే పరిపాలన సాగుతున్నదని తెలిపారు. ఈ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా తెలంగాణ నేలమీద మరో ఉద్యమం జరుగుతున్నదని, ఈ ఉద్యమంలో ప్రజలంతా, విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కాగా, నిజాం రాజు ఎన్ని హింసలు పెట్టినా దాశరథి తెలంగాణ వాదాన్ని వదలలేదని కొనియాడారు. ప్రతి ప్రజా ఉద్యమంలో పాల్పంచుకున్న గొప్ప వ్యక్తి దాశరథి అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమానికి దాశరథి రచనలు స్ఫూర్తినిచ్చాయనీ, పోరాటానికి దాశరథి మందుగుండు సామాగ్రిని తయారు చేశారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ సోయితో పరిపాలన జరగడం లేదనీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఎంఎల్‌సి కవిత విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, మాజీ సరస్వతి పరిషత్ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, కవి, రచయిత కాంచనపల్లి గోవర్ధన్ రాజు, జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివ శంకర్, పాత్రికేయులు పరాంకుశం వేణుగోపాల స్వామి, రచయిత మిట్టపల్లి సురేందర్, సింగర్ మానుకోట ప్రసాద్, సందీప్, దర్శకులు పూర్ణ, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్, జాగృతి నాయకులు శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.