Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌ది ఎన్నికల బంధం.. బిఆర్‌ఎస్‌ది పేగుబంధం: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీది ఎన్నికల బంధమని, బిఆర్‌ఎస్‌ది ముమ్మాటికి ప్రజలతో పేగు బంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా బిఆర్‌ఎస్ కార్యాలయంలో అర్బన్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలోని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్ పార్టీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ వరకు కుటుంబ పాలనను కొనసాగించారని ఆమె గుర్తు చేశారు. నాటి ప్రధాని మంత్రి జవహర్ లాల్ నెహ్రు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలిపి మోసం చేయగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1969లో మళ్లీ విడత ఉద్యమంలో సుమారు 364 మందిని కాల్చి చంపారని, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సైతం తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ బిఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారని అన్నారు. మనది పేగు బంధమైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బంధమని ఆమె వ్యాఖ్యానించారు.

రాహుల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఇక ఎన్నికలు నెలరోజుల్లో ఉన్నందున ఆయా రాజకీయ పార్టీలు ఏవేవో హామీలు ఇస్తాయని, ఆ హామీలను ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఒక్కొక్క కార్యకర్త, నాయకులు గల్లీగల్లీకి తిరిగి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని ప్రజలకు వివరించాలన్నారు. బిగాలకు మంచి లక్షణాలు ఉన్నాయని, అందుకే కెసిఆర్ మళ్లీ టికెట్ ఇచ్చారని ఆమె గుర్తు చేసింది. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ఏర్పడిన పదేళ్ళలో పేద ప్రజలకు ఎన్నో చేశామని, మనం చేసే పనిని చెప్పుకోవడం లేదని, కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరముందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలను ప్రజలకు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ ప్రతి గుండెను ఎలా తాకారో ప్రస్తుతం కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపులు గుండెను తట్టారన్నారు. విపక్ష నేతలు ఏవేవో విమర్శలు చేస్తుంటారని, వాటికి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. అర్బన్‌లో బిఆర్‌ఎస్ గెలుపు తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.నగరంలో సమానంగా అభివృద్ధి చేశామని, సమానంగా మెజారిటీ తెచ్చుకోవా ల్సిందేనన్నారు. మన గెలుపు తథ్యమైనప్పటికి అతివిశ్వాసంతో ఉండకూడదని,

అందుకని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రామగ్రామాన హనుమాన్ మందిరాలు ఎలా ఉంటాయో కెసిఆర్ పథకాలు రాని గ్రామమంటూ ఉండదన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు, దళితబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నగరంలో ఐటి హబ్‌ను తీసుకవచ్చుకున్నామని, దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్తులో పరిశ్రమలు కూడా రానున్నాయని ఆమె అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతోనే అర్హులైన పేద ప్రజలందరికి కెసిఆర్ రక్షా పేరుతో బీమా అందించనున్నామన్నారు. ఆసరా పింఛన్లను మూడువేల నుంచి దశల వారీగా 5వేల వరకు పెంచుతామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మూడోసారి గెలిపించుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో నగర మేయర్ నీతూకిరణ్, నగరాధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News