Monday, November 18, 2024

గిరిజనుల అభివృద్ధికి కెసిఆర్ సర్కార్ ఎంతో చేసింది:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్  : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మారుమూల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేనని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఎస్టీ సబ్ ప్లాన్ కింద 90వేల కోట్ల రూపాయలు వెచ్చించామని, రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని కవితపేర్కొన్నారు. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6శాతం నుంచి 10 శాతానికి పెంచడం ద్వారా గిరిజన బిడ్డలకు విద్య, ఉపాధిలో అదనపు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాంగ్రా సమీపంలో ఆదివారం బంజారా భవన నిర్మాణానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని, 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని చెప్పారు.

అయినా తెలంగాణా గిరిజనుల రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదన్నది ప్రధాని మోడీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 8ఏళ్లు వేచిచూసి ఇక ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని స్పష్టం చేశారు. తద్వారా గిరిజనులకు విద్యలో, ఉపాధిలో ప్రయోజనం కలుగుతుందన్నారు. రిజర్వేషన్ పెంచిన తర్వాత దాదాపు 3985 మంది గిరిజన బిడ్డలకు అదనంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయని, 195 మందికి మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు లభించాయని వివరించారు. సమాజానికి మంచి జరగాలన్న ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ రిజర్వేషన్లను పెంచారని, రాజకీయం కోసం కాదన్నది ఈ లెక్కలే నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం గిరిజనుల తరతరాల్లో మార్పు వస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విఙ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో 3200 పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా హోదా కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కిందన్నారు..

బంజారాల కోసం సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నో పనులు చేసిందని, అంతేగాక పది లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యా ణ లక్ష్మీ వచ్చిందంటే అది కేవలం గిరిపుత్రుల వల్లనే వచ్చిందని తాను ఎపుడూ చెబుతుంటానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ వరంగల్ ప్రాంతంలో ఓ తండాల నిద్రించిన క్రమంలో అక్కడే ఇల్లు దగ్ధమై బిడ్డకోసం దాచుకున్న డబ్బు పోవడంతో వారు సిఎం కెసిఆర్‌ను ఆశ్రయించి రూ.50వేలు ఇస్తే బిడ్డ పెళ్లి చేస్తామని వారు అన్నారని, ఈ మాట గుర్తుంచుకున్న సిఎం కెసిఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంఎల్‌ఏ, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ధర్‌పల్లి జడ్‌పిటిసి బాజిరెడ్డి జగన్, బంజారాల పీఠాధిపతి బాబూసింగ్ మహరాజ్, బంజారా సంఘ నాయకులు రాంచంద్ర నాయక్, మోహన్ నాయక్, తదితర బంజారా నాయకులు ఆయా గ్రామాల బంజారా పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News