మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్వతంత్ర పోరాటంలో, హైదరాబాద్ సమైక్యత ఉద్యమంలో బిజెపి ఎలాంటి పాత్ర పోషించిందని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. శనివారం కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌లో ఉన్న నేపథ్యంలో తన ప్రశ్నకు ఆయన, బిజెపి నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. బిజెపి నేతలకు అలవాటైన ‘ఎన్నికల ఉత్సవాలు’ అనే సహజ సూత్రం ఆధారంగా రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను హూజాక్ చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకు వచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే వంచించడం బిజెపికి అలవాటే అని తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ బిడ్డగా, తన ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు హక్కులు కలిపించడానికి బిజెపి చేసిందేమీ లేదని ఎంఎల్‌సి కవిత తెలిపారు. సామరస్యం, ఏకత్వం, ప్రజాబలం ఇవే సిఎం కెసిఆర్‌కు, తెలంగాణకు పునాది అని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఎప్పుడూ పోరాటం చేసిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలను అని ఆమె తెలిపారు. ఆమె మరో ట్వీట్‌లో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలని తెలిపారు. స్వరాష్ట్రంగా మారి సిఎం కెసిఆర్ సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నెంబర్ వన్‌గా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోందని ఆమె తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానిస్తూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేవలం సిఎం కెసిఆర్ విశాల దృక్పథం వల్లే సాధ్యమైందని ఆమె ట్వీట్ చేశారు.
MLC Kavitha question to BJP Role in Telangana Integration