రాష్ట్రంలో ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వడంపై ఘిబ్లీ ఇమేజ్‌తో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత వినూత్న రూపంలో ఇంస్టాగ్రామ్‌లో ప్రియాంక గాంధీని ప్రశ్నించారు. ‘ప్రియాంక జీ, స్కూటీ ఎక్కడ..?’ అంటూ ఇంస్టాగ్రామ్‌లో తాను స్కూటీ మీనియేచర్‌ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్‌ను ఎంఎల్‌సి కవిత పోస్ట్ చేశారు.
మహిళలపై వరుస నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి : ఎక్స్‌లో ఎంఎల్‌సి కవిత
తెలంగాణలో మహిళలపై వరుస నేరాలు, దాడులు, అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో దేవాలయం వద్ద, హైదరాబాదులో జర్మన్ పర్యాటకురాలిపై జరిగిన అఘాయిత్యాలు ఆవేదన కలిగించాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని తేటతెల్లమవుతున్నదని వ్యాఖ్యానించారు. మహిళలపై వరుస నేరాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని సూచిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై 22 శాతం మేర నేరాలు పెరిగాయని అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తూ ఏం సంకేతమిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్ర వీడి రాష్ట్రంలో మహిళల భద్రతపై చర్యలు చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.