సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం కోసం 5 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు ఆదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసుపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. అఖండ భారతంలో ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా..? అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా, ఆడబిడ్డను అరెస్టు చేయడం మోదీ సర్కార్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదే ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా..? అని నిలదీశారు.
ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా, అదానీ వైపే ప్రధాని ఉంటారా..? అంటూ కవిత తెలుగు, ఇంగ్లీష్‌లో చేసిన ట్వీట్లలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను సిబిఐ, ఇడి అరెస్ట్ చేయడంతో తిహాడ్ జైలులో ఉన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కవిత హైదరాబాద్ వచ్చిన తరువాత ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కవిత ఎక్స్ వేదికగా తొలిసారి స్పందించారు.