Wednesday, January 22, 2025

మన కళలు, సాహిత్యం తెలంగాణ పంచ ప్రాణాలు: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Says arts and literature are life of telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటిప్రభలతో వెలుగొందుతుందని, మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ఆవిష్కృతమైందని జాగృతి వ్యవస్థాపక అద్యక్షులు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కోటి ఉమెన్స్‌ కాలేజీ అద్యాపకురాలు డాక్టర్‌ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’ అన్న పరిశోధనా గ్రంథాన్ని బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కళలు, సాహిత్యమన్నవి తెలంగాణ సమాజానికి పంచ ప్రాణాలుగా నిలుస్తాయన్నారు. తరతరాల మన మూల సంస్కృతి, సమాజ పరిణామ క్రమం, చరిత్ర, సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు జరుగవలసి ఉందని చెప్పారు. మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం రెండూ తెలంగాణకు రెండు కళ్లవంటివని అభివర్ణించారు.

తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ఆటుపోట్లన్నీ తెలంగాణ కథల్లో, పాటల్లో, కవితల్లో, నవలల్లో నిక్షిప్తమై ఉన్నాయని వివరించారు. తెలంగాణ కథా సాహిత్యం వాస్తవిక జీవితానికి దగ్గరగా ఉంటుందని విశ్లేషించారు. తెలంగాణ సాహిత్యం విస్తృతమైందని, కల్పన కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి ‘‘మన వూరు`మన చెట్లు’’ అన్న కథల పోటీ నిర్వహిస్తే అందులో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొనటం దేశంలోని బాల సాహిత్య చరిత్రలోనే నూతన అధ్యాయనంగా నిలిచిపోతుందని ప్రకటించారు. మన తరతరాల సామాజిక చరిత్రకు సజీవ ప్రతీకగా తెలంగాణ సాహిత్యం నిరంతరం జీవ కవిత్వ జీవనదిలా ప్రవహిస్తుందని కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, గాయత్రి రవి, కథా రచయిత్రి డాక్టర్‌ ఎం. దేవేంద్ర, అద్యాపకుడు ఎం. నర్సింహాచారి , తెరాస నాయకులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News