Monday, November 18, 2024

నేమ్ ఛేంజర్ మాత్రమే గేమ్ ఛేంజర్ కాదు:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ ఛేంజర్ మాత్రమేనని, గేమ్ ఛేంజర్ కాదని నిజామాబాద్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత విమర్శించారు. పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామంటున్నదే తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, పథకాలకు పూర్తి కేటాయింపులు లేకపోయినప్పటికీ రానున్న ఐదేళ్ల ప్రణాళికకు సంబంధించి ఎక్కడా లేదని ఆక్షేపించారు. గత ప్రభుత్వాలను విమర్శించడానికి సమావేశాలు పెట్టినట్లుగా ఉందని, మహిళా సంక్షేమం కోసం కేటాయింపుల్లో ప్రతిపాదనలు లేవన్నారు. మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎంఎల్‌సి కవిత మీడియాతో మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కెసిఆర్ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బడ్జెట్‌లో దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు.

ఆశా వర్కర్ల జీతాలను రూ.18వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చినా బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందన్నారు. మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు దారి చూపిస్తుందని భావించామని తెలిపారు. కానీ, మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని స్పష్టం చేశారు. కేటాయింపులు ముఖ్యం కాదని, ప్రభుత్వ ధృక్పథం బడ్జెట్‌ను సూచిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడిందని, ఇమా మ్‌లకు, మౌజమ్‌లకు రూ.10వేలు ఇస్తామని, పిల్లల కోసం తౌఫే తాలిమ్‌ను మొదలుపెడుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినా బడ్జెట్‌లో విస్మరించిందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.2వేలకోట్లు మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు.

ఎన్నికల సమ యంలో చెప్పిన సూక్ష్మస్థాయి హామీల అమలు ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు. పేర్లు, చిహ్నాలు మార్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత హామీల అమలుకు కేటాయింపులు చేపట్టడానికి ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. కాగా, కెసిఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకపోయేదని, కానీ, ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలోనే ప్రతి రోజూ 3-4 గంటల పాటు కరెంటు పోతుందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News