కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు రూ. లక్ష 52 వేలకుపైగా అప్పులు చేసిందని ఎండగట్టారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పనీ చేయలేదని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ..
తెలంగాణ గొప్పగా, ఉన్నతంగా ఉందంటూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పదేళ్లలో కెసిఆర్ చాటిచెప్పి పెట్టుబడులను ఆహ్వానిస్తే… ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేదని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమని మండిపడ్డారు. సిఎం వ్యాఖ్యలతో దేశంలో ఉన్న అన్ని పత్రికలు కూడా తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉందని రాశాయని, ఇది బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఆరోపించారు.
కెసిఆర్ పదేళ్లలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించారు
హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి దొంగ లెక్కలు చెబుతున్నారని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రికి సామాజిక స్పృహ, దృక్పథం లేదని, హామీలు అమలు చేయాలన్న నియ్యత్ లేదని అన్నారు. భవిష్యత్తు పట్ల దూరదృష్టి లేదని, పేదల కడుపునింపాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. 15 నెలల్లో పేదలకు ఒక్క మంచి పనీ చేయలేదని, కానీ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం నిరంతరం కొనసాగుతుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత పెద్దవాళ్లపై ఉందని, పేద వాళ్లపై లేదని విమర్శించారు.
2023 నవంబరు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసిందని, అంటే సగటున నెలకు రూ 10 వేల కోట్లు అప్పు తెస్తున్నారని, ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ 2500 ఇవ్వడం లేదు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకం సంపూర్ణంగా అమలు కాలేదని, వరికి బోనస్ బోగస్ అయింది.. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని నిలదీశారు. కెసిఆర్ లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని బద్నాం చేశారని, కానీ కెసిఆర్ చేసిన అప్పుకు ప్రతీ పైసాకు లెక్క చెబుతామని చెప్పారు. మరి లక్షా 50 వేల కోట్ల అప్పుకు లెక్క చెప్తారా..? అని నిలదీశారు. పదేళ్లలో కెసిఆర్ కేవలం 4 లక్షల 30 వేల కోట్లు అప్పు తెచ్చారని, కానీ అంతకు రెట్టింపు అభివృద్ధి చేశారని తెలిపారు. అప్పు 4 లక్షల కోట్లు అయితే.. సృష్టించిన సంపద 50 లక్షల కోట్లు అని ఎంఎల్‌సి వ్యాఖ్యానించారు.
…………………………………………………..