బిఆర్ఎస్ పాలనలోనే దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు
లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్న సిఎం కెసిఆర్
దేశంలో గగ్గోలు పరిస్థితులు ఉంటే… తెలంగాణలో ఒక్క మతకల్లోలం జరగలేదు
దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అనేక రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తారని బిఆర్ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్నారన్నారు. శాంతి సామరస్యాలతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ధృడంగా నమ్ముతారన్నారు.
ఈ నెల 17న కెసిఆర్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో టిఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఆ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి అని అన్నారు. కులాలు, మతాల పట్టింపు లేని వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్ పనిచేస్తున్నారన్నారు. దేశంలో కులమతాలకు సంబంధించి గగ్గోలు పరిస్థితి నెలకొన్న సందర్భంలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు. గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని నమ్మే వ్యక్తి కెసిఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. బతుకమ్మ ,బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండగలకు రాష్ట్ర ప్రభుత్వం తగు సహకారాన్ని అందిస్తుందన్నారు. కాగా తెలంగాణ ఉద్యమంలో క్రైస్తవ సోదరుల పాత్ర మర్చిపోలేమన్నారు. రాష్ట్ర సాధన కోసం శాంతియాత్రలు చేసి చర్చలను బందు పెట్టి పోరాటం చేశారని కొనియాడారు. క్రైస్తవుల సమస్యలను సిఎం పరిష్కరించారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రైస్తవ మతపెద్దలు రసలం మోడరేటర్ రేవరెండ్ ఎ. ధర్మరాజ్, మెదక్ బిషప్ రెవరెండ్ కె. పద్మారావు, ఈస్ట్ కేరళ బిషప్ రెవరెండ్ వి.ఎస్. ఫ్రాన్సిస్, కర్నాటక బిషప్ రెవరెండ్ హేమచంద్ర కుమార్, తమిళనాడు ఐసిఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెవరెండ్ ఎమ్మెస్ మార్టిన్‌తో పాటు బిఆర్ఎస్ ఎంఎల్‌సి రాజేశ్వర్ రావు, ఎపి బిఆర్ఎస్ నాయకుడు రావెల కిషోర్ బాబు,బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రాజారత్నం, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేష్ తదితరులు పాల్గొన్నారు.