కరీంనగర్: ఆడబిడ్డల్లో ఆత్మస్థైర్యం నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షతన మహాత్మానగర్‌లోని రాంలీలా మైదానంలో ‘నారీ.. ప్రభాత భేరి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, మహిళా.. శిశుసంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆడబిడ్డల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఏ తోడు లేకున్నా.. తాను చదివిన చదువు మాత్రం జీవితకాలం తోడుంటుందనీ, అందుకే ప్రతి స్త్రీ తప్పకుండా చదువుకోవాలని సూచించారు. ఎంత కష్టమైనప్పటికీ ఆడబిడ్డల తల్లిదండ్రులు మాత్రం తప్పక ఆమెను చదివించాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందనీ, త్వరలోనే వడ్డీలేని రుణాలతో పాటు అభయహస్తం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలకు 18వేల కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు.