మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. గురువారం సిఎం కెసిఆర్ సతీమణి శోభ, ఎంఎల్‌సి కల్వ కుంట్ల కవితపలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గంగా హారతి నిర్వహించారు. గురువారం ఉదయం కవిత, శోభ తమ కు టుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుండి వారణాసి బయలుదేరారు. వారణాసిలో ముందుగా అస్సిఘాట్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణిస్తూ, బోటు నడిపే వారితో కవిత కాసేపు ముచ్చటించారు. గంగానది బోటులో విహరిస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగా నదికి కవిత హారతి ఇచ్చారు. అనంతరం గంగా పూజ నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ లో స్థానిక బెనారస్ ప్రజలతో సంభాషించారు. దశాశ్వమేధ ఘాట్ లో పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు. పవిత్ర గంగానది ప్రశాంతత తమను మంత్రముగ్ధులను చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం బోట్‌లో అస్సీ ఘాట్‌కు వారు తిరుగు ప్రయాణమయ్యారు.
సాయంత్రం ప్రాచీన సంకట్ మోచన్ మందిరాన్ని దర్శించుకొని వారు పట్టువస్త్రాలు సమర్పించారు. మహంత్ తులసీదాస్ నిర్మించిన సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు, రామభక్తుడైన హనుమంతుడు ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రధాన పూజారి మహంత్ డా.విశ్వంభర నాథ్ మిశ్రా, కవిత, శోభతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ఈ సందర్భంగా వారు ప్రార్థించారు.
MLC Kavitha Spiritual Visits to Varanasi