Thursday, January 23, 2025

కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ: కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పివి కొనియాడారు. సోమవారం నిజామాబాద్‌లో బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసిన పివి నరసింహారావు విగ్రహాన్ని పివి కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి, కుమారుడు ప్రభాకర్‌రావుతో కలిసి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితిలో మొత్తం కుదైలైన సందర్భంలో పివి నరసింహారవు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న బంగారం కుదవపెట్టి అన్నమో రామచంద్ర అనుకుంటున్న క్లిష్ట సమయంలో ప్రధాని అయిన పివి కేవలం తన మేధోసంపత్తితో ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు.

ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆనాడు పివి తీసుకున్న చర్యల వల్ల ఈరోజు లక్షలాది మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని, కోట్లాది కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎగబాకాయన్న విషయం భారత దేశంలో ఎప్పటికి మర్చిపోదని స్పష్టం చేశారు. కానీ అటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సిఎం కెసిఆర్ పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు జరిగాయని, పివి ఆలోచనా విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రతి తెలంగాణ బిడ్డ గుండెకు తట్టేలా చాటి చెబుతామని ప్రపంచానికి పివి స్ఫూర్తిని పంచుతామని అన్నారు. పివి నర్సింహారావు విగ్రహం ఏర్పాటుతో నిజామాబాద్‌కు కొత్త కళ వచ్చిందన్నారు.

తెలంగాణ నుంచి ఎదిగి దేశానికి ఎంత సేవ చేశారో అందరికి తెలుస్తుందని, నూతన ఉత్సాహం వస్తుందని చెప్పారు. పివి 14 భాషల్లో మాట్లాడడం అంటే మామూలు మేధో సంపత్తి కాదని కొనియాడారు. అంత మేధో సంపత్తి ఉన్న సరే పట్వారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలానే ఉన్నారన్నారు. ఆహార్యంలో కూడా ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిత్వ శాఖను మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖగా మార్చి అత్యద్బుతమైన కొత్త పద్ధ్దతులను ప్రవేశపెట్టారని తెలిపారు. పివి నరసింహారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి సాంఘిక సంక్షేమ పాఠశాలలను సర్వేల్‌లో ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను పాఠశాలలను ఏర్పాటు చేశారని, దాంతో లక్షలాది మంది మేధావులు తయారయ్యారని చెప్పారు. దేశంలో లక్షాలది మందికి తెలంగాణ బిడ్డచేత చదువు ప్రారంభమయ్యిందంటే మనందరం గర్వపడాలన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం (పి) చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పివి నరసింహారావు కొడుకు పివి ప్రభాకర్‌రావు, కూతురు ఎమ్మెల్సీ సురభివాణి, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేబిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్‌రావు, బిఆర్‌ఎస్ నాయకులు మహేష్ బిగాల, మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్ హాజరయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో అతిధులకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, పివి నరసింహారావు కొడుకు పివి ప్రభాకర్, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిలు పివి నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News