Wednesday, December 25, 2024

పది రోజులకో పసి బిడ్డ ప్రాణం పొతుంది:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

పది రోజులకో పసి బిడ్డ ప్రాణం పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్డల ప్రాణాలను ప్రాధాన్యతగల అంశంగా స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం నాడు ఎంఎల్‌సి కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ…ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ ఒక్క పాఠశాలను చూసినా ఏదో ఒక సంఘటన జరిగిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని స్పష్టం చేశారు. మరణించిన 42 మంది పిల్లల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం చాలా బాధాకరమని వాపోయారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్టు ఉండడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుందని, సగటున నెలకు ముగ్గురు చొప్పున ఇప్పటివరకు 42 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆహారం విషతుల్యమై మరణించారని అన్నారు. సగటున పదిరోజులకు ఒక పసి ప్రాణాన్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సంక్షేమ శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్ద ఉండడం వల్ల సమయం వెచ్చించలేకపోతున్నట్లు కనిపిస్తోందని, కనీసం పది నిమిషాల సమయాన్ని కేటాయించి సమీక్ష చేస్తే పసి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుందని సూచించారు. నారాయణపేట హాస్టళ్లలో విషతుల్య ఆహారం తినడం కారణంగా పిల్లలు అనారోగ్యం పాలైన తర్వాత ముఖ్యమంత్రి సమీక్ష చేసిన మరునాడే అలాంటి మరో సంఘటన జరగడం ఆందోళనకరమని ఎంఎల్‌సి కవిత అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News