Friday, December 20, 2024

తెలంగాణకు వచ్చే ముందే మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌ : ప్రధాని నరేంద్ర తెలంగాణ పర్యటనకు వచ్చే ముందే రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలని అన్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌కు రూ. 42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రకటించినట్లే తెలంగాణకు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళా రిజర్వేషన్ల సాధన తర్వాత తొలిసారి నిజామాబాద్‌కు వచ్చిన కల్వకుంట్ల కవితకు కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఐటిఐ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు జరిగిన భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళా బిల్లు ఆమోదం పొంది ప్రపంచంలో ఇతర దేశాల సరసన భారతదేశం నిలబడిందంటే అందుకు బిఆర్‌ఎస్ పార్టీయే కారణమని స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టడం మర్చిపోయిందని, వాళ్లను బిఆర్‌ఎస్ పార్టీ నిద్రలేపిందని తెలిపారు.

ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా మాట్లాడే పరిస్థితిని బిఆర్‌ఎస్ తీసుకొచ్చిందని అన్నారు. ఓబిసి మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని, 20ఏళ్ల కింద కాంగ్రెస్ ఆ తెలివి ఉంటే అప్పుడే బిసి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం జరిగి ఉండేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు ఆ తెలివి లేదని, అధికారం కోల్పోయిన తర్వాత బిసిలు గుర్తుకొచ్చారని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ స్వప్నమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటున్నారని, అన్ని రంగాలలో పురోగతి సాధించాలని మహిళలు, ముస్లింలు, దళితులు, యువత బాగుపడాలని కెసిఆర్ స్వప్నమని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్ప అధికార యవ తప్పా మరేది పట్టదని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అని తేల్చి చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో గత పది ఏళ్లుగా తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ పరిపాలిస్తుందని, తమ పార్టీ పాలనలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, ఒక చిన్న గొడవ కూడా జరగలేదని చెప్పారు.

దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా తెలంగాణలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయి. కాబట్టే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా యువతకు ఉద్యోగవకాశాలు కలుగుతున్నాయని వివరించారు. అభివృద్ధి ఒకటే కాదు ప్రజలకు ఆత్మగౌరవం ఉండాలన్న ఆలోచన తమ పార్టీదని, అందుకే సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. బిడి కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్ కమిటీల పదవుల్లో మహిళలకు సిఎం కెసిఆర్ అవకాశం కల్పించారని చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రతి ఒక్క వర్గం గురించి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఇవన్నీ చేస్తుంటే ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ వచ్చి తామే అధికారంలోకి వస్తామని అంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం అవడం లేదని అన్నారు. మన గురించి ఆలోచించే మన నాయకుడు సిఎం కెసిఆర్‌ను కడుపులో పెట్టుకోవాలని కోరారు. నిజామాబాద్‌లో ఎమ్మెల్యే గణేష్ గుప్తా అద్బుతంగా పని చేస్తున్నారని, ఆయనను మరొకసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News