కేంద్రం పేరుకే గెజిట్ జారీ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని పసుపు మార్కెట్ యార్డును ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పసుపు రైతుల సమస్యలు, పసుపు ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచివచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని, స్థానికంగా పసుపునకు మంచి రేటు వస్తుందని తెలిపారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగైదు రోజులు వేచి చూసినా పసుపు కొనడం లేదని, ఒక రకంగా రైతును బ్లాక్‌మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని ఆరోపించారు.
ఎంత మంచి నాణ్యత గల పసుపునకు అయినా మంచి ధర ఇవ్వడం లేదని, రూ.12 వేల కనీస ధర కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని అన్నారు. అంతకు తక్కువ ధర ఉంటే మిగతా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, తక్షణమే పసుపునకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత, కనీస మద్దతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. బనకచర్ల నుంచి మన నీటిని ఏపి ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే ఎపి సిఎం చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ రైతుల కంటే చంద్రబాబుపై ఎక్కువ ప్రేమ ఉందా అంటూ ధ్వజమెత్తారు. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలను ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని నిలదీశారు.
ప్రజాభవన్‌లో ఏపి, తెలంగాణ సిఎంల సమావేశం తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని చంద్రబాబు ప్రకటించారని, బాబుకు రేవంత్‌రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన ప్రకటన చేశారని ఆరోపించారు. గోదావరి నది నుంచి 200 టిఎంసిలను తరలించడానికి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మన దగ్గరి నుంచి 200 టిఎంసిల నీటినిఏపి ఎత్తుకపోతుంటే ముఖ్యమంత్రి చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల కంటే రేవంత్‌రెడ్డికి ఎక్కువ ప్రేమ చంద్రబాబుపై ఉందా. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. ఈ విషయంలో మాట్లాడవద్దని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ తీరులో మార్పు రాలేదని, బహుశా కోర్టు మరోసారి చివాట్లు పెట్టాలేమో, అప్పుడు గానీ మారరేమో అని ఎద్దేవా చేశారు.