హైదరాబాద్: బిసి జనగణన చేయాలని కొత్తగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఎంఎల్ సి కవిత విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంగళవారం కవిత మాట్లాడారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అని ప్రశంసించారు. రాహుల్ గాంధీ 60 ఏళ్ల నుంచి ఏం చేశారు ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎంత మంది బిసిలు ఉన్నారో గుర్తించాలని కవిత డిమాండ్ చేశారు. బిసి మంత్రిత్వ శాఖ గురించి బిఆర్ఎస్ ఎన్ని సార్లు అడిగినా కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్పందించలేదని, కాంగ్రెస్ కనీసం మాట్లాడలేదని చురకలంటించారు.
60 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు చేయని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇప్పుడు కుల గణన చేస్తామని మాట్లాడాటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు బిసిలు గుర్తుకు వచ్చారా? అని ప్రశించారు. దేశంలో ఎంత మంది బిసిలు ఉన్నారో లెక్క తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. మహిళ బిల్లులో కూడా బిసి మహిళల కోట తేల్చాలని, గణేష్ గుప్తా కు ఓటు వేస్తే సిఎం కెసిఆర్ కు వేసినట్టేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి పాల్గొనడం జరిగింది.