హైదరాబాద్: రైతు బంధు వద్దంటున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని ఎంఎల్‌సి కవిత పిలుపునిచ్చారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్సెస్ రైతులకు జరిగే ఎన్నిక అని, ఒక్క కెసిఆర్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బిజెపికి తెలంగాణలో స్కోప్ లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. బిసిల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు కాంగ్రెస్ పార్టీ అని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు.
బిఆర్‌ఎస్ బిసిల పార్టీ అని, తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రచారంలో దూసుకుపోతుందన్నారు. బిఆర్‌ఎస్ భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలలో స్పష్టత లోపించిందని, ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటనలే పూర్తి కాలేదని విమర్శలు గుప్పించారు. ఎన్నకలప్పుడు వచ్చే పార్టీలు రైతుబంధు ఆపమంటున్నారని, అభద్రత భావంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ సుస్థిరత, అభివృద్ధి, వికాసం కొనసాగాలంటే కెసిఆర్ నాయకత్వం అవసరమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. బిఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ క్లిన్ స్వీప్ చేస్తామన్నారు. గల్ఫ్ వెళ్లిన వారికి కెసిఆర్ బీమాతో మేలు జరుగుతుందని, నిజాలు చెబుతూ ప్రచారం చేయటం బిఆర్‌ఎస్ నైజమని ఎంఎల్‌సి కవిత స్పష్టం చేశారు.