Monday, December 23, 2024

ఈటెలవి నల్లికుట్ల రాజకీయాలు !

- Advertisement -
- Advertisement -

MLC Koushik reddy comments on Etela rajender

రాజేందర్ ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్నాడు
గోతులు తవ్వే అలవాటు ఉన్న ఈటెల నీతులు చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్నాడని, గోతులు తవ్వే అలవాటు ఉన్న ఈటెల నీతులు చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన టిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటెల నల్లికుట్ల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈటల మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ పద్ధతులు ఉండేవో ఇప్పుడు అవే పద్ధతులు ఉన్నాయన్నారు. ఈటెల పార్టీ మారినంత మాత్రాన అసెంబ్లీ పద్ధతులు మారుస్తారా అని ఆయన ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడం లేదో ముందు ఈటెల రాజేందర్ జవాబు చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈటెల చెప్పినంత మాత్రాన నిజాలు అబద్దాలు కావని, అబద్దాలు నిజాలు కావని, ఈటెల రాజకీయ జీవితం హత్యరాజకీయాలతో ముడిపడి ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగాపూర్‌లో ఎంపిటిసి బాలరాజును చంపించింది ఈటెల కాదా నర్సింగా పూర్‌లో ఈటెలపై గ్రామస్థులు చెప్పులతో దాడి చేయించింది నిజం కాదా అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమ కారుడు ప్రవీణ్ యాదవ్ పై మంత్రిగా ఉండి దాడి చేయించింది ఈటెల అవునో కాదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 25 రోజుల క్రితం మల్లయ్యపై దాడి చేయించింది ఈటెల అని, ఈటెలది రక్త చరిత్ర కనుకే ఎప్పటికీ ఆయన అందరినీ అదే కోణంలో చూస్తారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

ఈటెల చర్చకు రావడానికి సిద్ధమా ?
ఈటెల రక్త చరిత్రపై చర్చకు రావడానికి సిద్ధమా అని ఈటెలకు కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. కెసిఆర్‌ది హత్య రాజకీయాల సంస్కృతీ కాదని, ఆయన ప్రత్యర్ధులు కూడా దీనిని అంగీకరిస్తారని ఆయన తెలిపారు. ఈటెల పైకి కనిపించేంతటి అమాయకుడు కాదనీ, ఈటెల చెప్పేది ఒకటి చేసేది మరొకటని ఆయన ఆరోపించారు. తాను చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి అబద్ధమైనా ముక్కు నేలకు రాస్తానని, ఈటెల మాటి మాటికి కెసిఆర్‌తో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌కు ఈటెలకు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంద న్నారు. అన్నం పెట్టిన కెసిఆర్‌కు సున్నం పెట్టిన చరిత్ర ఈటలదని ఆయన పేర్కొన్నారు.

హుజురాబాద్ అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటే ఈటెల పారిపోయాడని ఆయన విమర్శించారు. మరో నెల అయితే ఈటెల ఉపఎన్నికల్లో గెలిచి సంవత్సరం అవుతుందని, ఈ ఏడాదిలో హుజురాబాద్‌కు ఒక్క లక్ష రూపాయలైనా తెచ్చావా, ఈటెల టిఆర్‌ఎస్ కార్యకర్తలకు తన పూర్వ చరిత్రను చెప్పి బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ లైసెన్స్‌లు యథేచ్ఛగా ఇస్తున్నారని ఈటెల అనడంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రాణహాని ఆధారంగా హుజురాబాద్‌లో నేతలకు గన్ లైసెన్స్‌లు ఇస్తున్నారని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు ఏదైనా జరిగితే కెసిఆర్‌దే బాధ్యత అని ఈటెల అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈటెలను ఎవరూ పట్టించుకోవడం లేదని, సానుభూతి రాజకీయాలు చేయడం ఈటెలకు అలవాటుగా మారిపోయిందని ఆయన తెలిపారు. తాను ఉద్యమ కుటుంబం నుంచి వచ్చానని, ఈటెల కన్నా ముందే మా నాన్న కెసిఆర్‌తో కలిసి పని చేశారని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News