Monday, December 23, 2024

రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు దక్కదు: పల్లా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి పార్టీ ఒక్క స్థానం కూడా నిలబెట్టుకునే స్థితిలో లేదని తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.ఆదివారం బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్, ఎంఎల్‌సి తాత ముధుసూదన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. రాజకీయ నేతలా విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రధాని పర్యటనపై వరంగల్ ప్రజలుగా తాము ఎన్నో పెట్టుకున్నామని, కానీ ప్రధాని వరంగల్ జిల్లా ప్రజలకు నిరాశ కల్పించారని పేర్కొన్నారు.విభజన హామీలు తీరుస్తారని భావించామని చెప్పారు. ప్రధాని తెలంగాణకు ఒక్క హామీ ఇవ్వలేకపోయారని అన్నారు.

ములుగు గిరిజన యూనివర్సిటీ గురించి ఒక్క మాట చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ బిజెపి నేతలు ఇచ్చిన స్క్రిప్టును మాత్రమే చదివారని, ఎక్కువ చదువుకొని ఉంటే ఇలాంటి పరిస్థితే ఉండేదికాదని ఎద్దేవా చేశారు. వరంగల్ పర్యటనలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ అదానీ, అంబానీల కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు.బయ్యారం, ఎపి స్టీల్ ఫ్యాక్టరీని ఆదానీకి అప్పగించే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని పర్యటించారనే అనుమానం కలుగుతుందన్నారు.

ప్రభుత్వ రంగంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు దేశంలో ఎవరూ ఇవ్వలేదు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బిజెపి నేతలవి తప్పుడు వ్యాఖ్యలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు. తెలంగాణలో గత 9 సంవత్సరాల్లో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 1.50 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. వాటిని భర్తీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన బిజెపి, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు దేశంలో ఎవరూ ఇవ్వలేదని చెప్పారు.

దీనిపై తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని, మీకు ఆ దమ్ముందా అంటూ బిజెపి నేతలకు సవాల్ విసిరారు. బిజెపి నేతల కుట్రలతోనే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకయ్యిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రైవేటు కంపెనీలను ఆకర్షించడం ద్వారా ఇప్పటి వరకు 23 వేల కంపెనీలు, సంస్థలు రూ.2.65 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయని, వీటి ద్వారా 17.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఐటీ రంగంలో తెలంగాణలో 9 లక్షలకుపైగా ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చే నాటికి వీరు 3 లక్షలు కూడా లేరని తెలిపారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని అన్నారు.
మోదీ అసమర్థతతో ప్రతి రోజు 270 కంపెనీల మూత
ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థత, అచేతనతో ప్రతి రోజు 270 కంపెనీలు మూత పడుతున్నాయని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్కలు తప్పయితే తాను ముక్కు నేలకు రాయడానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. వీటిపై బిజెపి నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిఎస్‌డిపి గణనీయంగా పెరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరగలేదని కేంద్ర మంత్రే.. ప్రధాని సమక్షంలో పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అవినీతిపై ఆరోపణలు చేస్తున్న బిజెపి నేతలు.. వాటిలో ఒక్కదాన్నైనా నిరూపించారా..? అని ప్రశ్నించారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, అక్కడి ప్రజలు బిజెపిని చిత్తుగా ఓడించారని అన్నారు. తెలంగాణలో అవినీతి గురించి మాట్లాడే ముందు ప్రధాని వ్యాపం స్కామ్‌పై స్పందించాలని డిమాండ్ చేశారు.

మద్యం కుంభకోణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర సంస్థలు స్వాధీనం చేసుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి రూ.3.60 లక్షల కోట్లు ఇస్తే కేంద్రం తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కేంద్రమే ఇంకా రూ.2 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కేంద్రం చేసిన అప్పు ఎంత..? రాష్ట్రం చేసిన అప్పు ఎంత అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతుబంధు ద్వారా రూ.70 వేల కోట్లకుపైగా రైతు ఖాతాల్లో నేరుగా వేశామని, కేంద్ర ప్రభుత్వ 13 కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి.. 3 కోట్లకు పరిమితం చేసిందని ధ్వజమెత్తారు. యూనివర్సిటీల్లో పోస్టులను భర్తీ చేయకుండా బిజెపి అనుబంధ విభాగాలు కోర్టుకు ఎక్కడంతో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దయ్యిందని, తాజాగా రిక్రూట్మెంట్‌కు తీసుకవచ్చిన చట్టంపై గవర్నర్ సంతకం చేయడం లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News