Friday, November 22, 2024

వైఎస్సార్సీపీకీ భారీ షాక్

- Advertisement -
- Advertisement -

వైఎస్సార్సీపీకీ కీలక నేతలు భారీ షాక్ ఇవ్వబోతున్నారు. కొందరు ఎంపీలు ఆ పార్టీని వీడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, బీజేపీలో చేరేందుకు కొందరు ఎంపీల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం వైఎస్సార్సీపీ మూటగట్టుకుంది. అనంతరం ఆ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలు మేయర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీ గుడ్ బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటన మరువక ముందే మరో కోలుకోలేని దెబ్బ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

వైఎస్సార్సీపీ ఎంపీలు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకట రమణ , బీదా మస్తాన్ రావు గురువారం రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీ బయలుదేరిన ఇద్దరు నేతలు గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్‌ని కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇద్దరూ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు బాటలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో ఎదురైన అవమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీ వీడుతున్నామని నేతలు అంటున్నారు. పలువురు ఎంపీలు బీజేపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

జగన్ రాజకీయంగా మరింత గడ్డు కాలం : వైఎస్సార్సీపీకి లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీ రాజ్యసభలో ప్రస్తుతం 11 మంది ఎంపీలు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పెద్దల సభలో వైఎస్సార్సీపీ ఉనికి కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే జగన్ రాజకీయంగా మరింత గడ్డు కాలం ఎదుర్కొక తప్పదు. అధికారం కోల్పోయి ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వరుస షాకులు తగులుతున్నాయి. కష్టకాలంలో అందరూ ఒక్కటై అధినేతకు తోడుగా ఉంటారనుకుంటే నేతలు మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
జగన్‌కు కోలుకోలేని దెబ్బ : ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా జగన్ కు వెరీ బిగ్ షాక్. జగన్ తోపాటు జైలు జీవితం అనుభవించిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వైఎస్ మరణం తర్వాత సీబీఐ కేసుల్లో జగన్ తోపాటు మోపిదేవి కూడా జైలుకెళ్లారు.

2019 ఎన్నికల్లోనే రేపల్లె నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ ఓడిపోయారు. అయినా కూడా తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో ఆయనను మంత్రిని చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆపై మండలిని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేయించి రాజ్యసభకు జగన్ పంపించారు. అలాంటి మోపిదేవి వెంకట రమణ రాజీనామా చేస్తున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీతోపాటు పార్టీకి సైతం రాజీనామా చేయబోతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మోపిదేవి రాజీనామా వార్తలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన వెంటే నడిచిన మోపిదేవికి జగన్ చేయాల్సింది అంతా చేశారని, ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రిని చేశారు.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిని చేశారు..అలాంటి మోపిదేవి అమ్మలాంటి పార్టీని వదిలి టీడీపీలోకి వెళుతున్నారని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News