Wednesday, January 22, 2025

కవిత వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : యువకుడి బలవన్మరణానికి కారకుడయ్యాడనే నేరారోపణతో జైలుకెళ్లిన బిఆర్‌ఎస్ నాయకుడిని పరామర్శించేందుకు వచ్చిన ఎంఎల్‌సి కవిత వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టించి తమ పార్టీ నేతను జైలుకు పంపించారని మాట్లాడటం సరికాదని పట్టభద్రుల ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురిచేసేలా కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థలను వాడుకుంటోందని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనినే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కవిత భావించడాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. గతంలో బిఆర్‌ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరుకు ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఏ తీర్పు ఇచ్చారో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.

నిరుపేద, నిరుద్యోగ యువకుడి ఇంటిపైకి వెళ్లి ముగ్గురు వ్యక్తులు దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోగా, తమ పైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ ఆ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేయడం వల్లే ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఉంటే ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడేవాడు కాదన్నారు. తన కొడుకును గ్రామ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు చంపుతామని బెదిరించడం వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గతేడాది అక్టోబర్ 1న ఆ నలుగురిపై కేసు నమోదు చేశారని వివరించారు. అక్టోబర్ 14న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించగా, రాజేశ్వర్‌రెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే నేరం నిర్ధారణ జరిగినప్పటికీ, సర్పంచ్ గ్రామంలోనే ఉన్నా పరారీలో ఉన్నట్లు చూపారని విమర్శించారు. ఎంఎల్‌సి కవిత కూడా ఒక మాతృమూర్తేనని, కొడుకును కోల్పోయిన ఒక తల్లి ఆవేదన ఆమెకు తెలియదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

నేరారోపణ ఎదుర్కొంటున్న నాయకుడిని పరామర్శించిన కవిత, 25 ఏళ్ల కొడుకును కోల్పోయిన కన్నతల్లిని రాజకీయ కాంక్ష లేని స్వచ్ఛంద సంస్థ జాగృతికి అధ్యక్షురాలిగా ఓదార్చాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. రాజకీయ కోణంతో ఆలోచించడమే తప్పా మానవీయ కోణంలో ఆలోచించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేసే ముందు పూర్వపరాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అధికారం అనేది తమకు కొత్తేమీ కాదని, ప్రజా జీవితంలో తాను అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నానని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీయాలనడం తప్పా…
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీయాలనడం తప్పా… మిషన్ భగీరథ కుంభకోణంపై విచాణ చేపట్టాలనడం తప్పా… కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంపై విచారణ చేపట్టాలని అనడం తప్పా అంటూ జీవన్‌రెడ్డి నిలదీశారు. వాస్తవాలు మాట్లాడితే మీరెందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నిస్తూనే గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రశ్చాతాపానికి మించిన శిక్ష లేదని యేసు ప్రభువు చెప్పినట్లుగా పొరపాట్లను సరిదిద్దుకుని ప్రశ్చాతాపం పొందాలని సూచించారు. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసు కనుసన్నల్లో ఉన్నా అరెస్ట్ చేయకపోవడంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్‌పికి లేఖ రాస్తానన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరి నాగభూషణం, గాజెంగి నందయ్య, మహేశ్, రాధాకిషన్, దామోదర్‌రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News