మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ గేట్ నం-8 వద్ద టిఆర్ఎస్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వాణిదేవి కారు గురువారం ప్రమాదానికి గురయ్యింది. ఆమె కారును డ్రైవర్‌కు బదులు గన్‌మెన్ పార్కింగ్ చేస్తున్న క్రమంలో కారు అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఎంఎల్‌సి సురభి వాణి దేవి గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలవడానికి వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేట్ నం8 దగ్గర పార్కింగ్ ప్లేస్‌లో ఆమె ఇన్నొవా కారు కంట్రోల్ కోల్పోయి అతి వేగంగా వచ్చి గేట్‌ను గుద్దుకుంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో వాణిదేవి కారులో లేకపోవండతో ఆమెకు ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన గేటు వద్ద నిత్యం పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. డ్రైవర్ తీయాల్సిన వాహనాన్ని గన్‌మెన్ తీయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకాక గన్‌మెన్‌కి డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో కారు ఎదుట భాగం పూర్తిగా ధ్వంసమైంది. కాగా నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన గన్‌మెన్‌ను విధులన నుంచి సస్పెండ్ చేసినట్టు నగర సిపి అంజనీకుమార్ వెల్లడించారు. వాణీదేవి కారు ప్రమాదానికి గురైన వెంటనే పోలీసులు సంఘటనా స్థలం నుంచి కారును తరలించారు.
MLC Vani Devi Car damaged in Accident at Assembly