ఇటీవల సింగపూర్ జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తన కొడుకు సురక్షితంగా బయటపడటంతో ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. తర్వాత కొడుకు పేరు మీద అన్నదానం కోసం భారీ విరాళం అందజేశారు. అయితే, కొందరు సోషల్ మీడియాలో అన్నా లెజినోవాపై ట్రోలింగ్ కు చేస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు. ఆమెపై ట్రోలింగ్ చేయడం సరికాదని మండిపడ్డారు.
“దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు” అంటూ ఎక్స్ లో పేర్కొన్నారు.