Saturday, November 23, 2024

కొనసాగుతున్న ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు….

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి నియోజకవర్గం, నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానానికి బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. సాయంత్రం వరకు బెండల్స్ కట్టే ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెప్పారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు కోసం హైదరాబాద్ స్థానానికి 806 మంది, నల్గొండ స్థానానికి 800 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది ప్రత్యేక శిక్షణ అందించామని అన్నారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో ఎనిమిది హాళ్లు ఉంటాయని, ఒక్కో హాళ్లో ఏడు టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఒకేసారి 56 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు గట్టి పోటీనిచ్చే స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో రసవత్తరంగా పోరు సాగుతోంది.

ఈ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు, నల్గొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం ఒక రికార్డయితే…ఓటర్లు సైతం అదే స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనడం మరో రికార్డు. దీంతో బుధవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు వేసే విధానంతోపాటు ఓట్ల లెక్కింపు విధానంతోనూ ఎంతో విభిన్నత ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో అయితే ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజేతగా ప్రకటిస్తారు.

కానీ ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్ల విధానంలో ఫలితాలు ఎప్పుడు, ఎటు మారతాయో చెప్పడం కష్టం. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు అధికంగా వచ్చే వరకు లెక్కింపు కొనసాగిస్తారు. ఆ తర్వాతనే విజేతను ప్రకటిస్తారు. ఈసారి హైదరాబాద్ నియోజకవర్గంలో 3.57 లక్షల మంది, నల్గొండ నియోజకవర్గంలో 3.86 లక్షలకుపైగా ఓట్లు పోలయ్యాయి. దాంతోపాటు ఈ రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో దినపత్రిక పరిమాణంలో జంబో బ్యాలెట్ పత్రం ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News