ఎండకు ఎదురేగి వెల్లువెత్తిన పట్టభద్రుల ఓటు
గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం
ఆరేళ్ల క్రితం పట్టభద్రుల ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి 54% పోలింగ్ జరగగా ఇప్పుడు 74% నమోదైంది
అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌కు అప్పుడు 39% పోల్ కాగా ఇప్పుడు 59.96%
2స్థానాల్లోనూ 164 మంది అభ్యర్థులు, 10లక్షలకు పైగా ఓటర్లు
వరంగల్ రూరల్ దామెర మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి వికలాంగులు ఓటు వేసిన విధానాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
17న ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో, నల్గొండ మార్కెట్ గిడ్డంగిలో కౌంటింగ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎంఎల్‌సి పోలింగ్ ప్రశా ంతంగా ముగిసింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో 74 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 59.96 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సాయంత్రం 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ రెండు పట్టభద్రుల స్థా నాలలో 10 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా, ఎ న్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలకు మొత్తం 164 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈసారి 1,685 జంబో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. హై దరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా రు. ఈ స్థానం నుంచి ప్రధానంగా టిఆర్‌ఎస్ తరపున సురభి వాణిదేవి, బిజెపి తరపున రామచందర్‌రావు, కాంగ్రెస్ తరపున చిన్నారెడ్డితో పా టు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు లు పోటీలో ఉన్నారు. అలాగే నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అ భ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధానంగా టిఆర్‌ఎస్ తరపున పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బిజెపి నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరపు న రాములు నాయక్, ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ చెరుకు సుధాకర్‌లు పోటీలో ఉన్నారు.
పెరిగిన పోలింగ్ శాతం
పట్టభద్రుల ఎంఎంల్‌సి ఎన్నికల్లో గతంతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరేళ్ల క్రితం గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి 54 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 74 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి 2015లో 39 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 59.96 శాతం పోలింగ్ నమోదైంది. మొదటిసారి ఓటు హక్కు లభించిన కొత్త ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి రెండు పట్టభద్రుల స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో దినపత్రిక పరిమాణంలో బ్యాలెట్ పత్రాన్ని రూపొందించారు. దాంతో ఓటు వేసే సమయంలో ప్రతి ఓటరు ఎక్కువ సమయం వినియోగించుకోవాల్సి వచ్చింది. దాంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. అయినా ఓటర్లు ఏమాత్రం విసుగు చెందకుండా గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తనిఖీ చేసిన ఇసి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140 పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన వికలాంగురాలు ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. అలాగే పోలింగ్ ఏజెంట్‌లతో మాట్లాడి ఓటరు గుర్తింపులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్బంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని అన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడనికి ఉత్సాహంగా వస్తున్నారని పేర్కొన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద సజావుగా ఓటు వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు.
17న ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు
సరూర్ నగర్ స్టేడియంలో, నల్గొండ మార్కెట్ గిడ్డంగిలో కౌంటింగ్
రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలకు ఆదివారం ఎన్నికలు ముగిసాయి. ఈనెల 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్-రంగారెడ్డి -మహబూబ్ నగర్ స్థానానికి సరూర్ నగర్ స్టేడియంలో, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి నల్గొండ మార్కెట్ గిడ్డంగిలో ఓట్ల లెక్కింపు చేపడతామని, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో ఎనిమిది హాళ్లు, ఒక్కో హాళ్లో ఏడు డు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒకేసారి 56 ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగానే సాగే అవకాశం
2015 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య భారీగా పెరగడంతోపాటు ఈసారి పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. భారీ సంఖ్యలో ఓటర్లు, రికార్డు స్థాయిలో అభ్యర్థులు, అనూహ్యంగా పెరిగిన పోలింగ్ శాతం నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగానే సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థులు గెలిస్తే ఓట్ల లెక్కింపు త్వరగా ముగిసే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎవరూ మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవకపోతే ఎలిమినేషన్ పద్దతిలో ఓట్ల లెక్కింపు చేపడతారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలిమినేషన్ పద్దతిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
MLC Voting Percent increase recorded in Telangana