ముందుగా 10 రైళ్లు నడుపుతున్నట్లు అధికారుల వెల్లడి
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు బుధవారం పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. లాక్‌డౌన్ పూర్తి స్దాయిలో ఎత్తివేయడంతో వీటిని నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. పది ఎంఎంటిఎస్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రయాణికులు పెరిగితే మరిన్ని రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిస్తున్నారు. రేపు అందుబాటులోకి రానున్న రైళ్లులో మూడు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, లింగంపల్లి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడవనున్నాయి. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే తొలి రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరుతుందని, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే మొదటి రైల్ ఉదయం 9.20గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు ఉదయం 8.43 గంటలకు వెళ్లుతుండగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.