Monday, December 23, 2024

నైజిరియన్ల రౌడీయిజం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పోలీసుపై అర్థరాత్రి దాడి ..హంగామా

న్యూఢిల్లీ : ఢిల్లీలో నైజిరియన్ల గుంపు పోలీసులపై దాడికి దిగింది. వారితో బాహాబాహికి పాల్పడి తమ జాతీయులను విడిపించుకుని పోయింది. శనివారం రాత్రి పూట దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీసా కాలపరిమితి ముగిసినా ఢిల్లీలోనే తిష్టవేసుకుని ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తూ ఇతరత్రా జులుంలకు దిగుతున్న నైజిరియన్లను యాంటీడ్రగ్స్ బృందాలు స్థానిక పోలీసు బలగాల సాయంతో అదుపులోకి తీసుకున్నాయి. వీరిని తీసుకునివెళ్లుతున్న దశలో ఉన్నట్లుండి వంద మంది వరకూ నైజిరియన్లు పోలీసు బలగాలను ఎదిరించివారిని చుట్టిముట్టి దాడికి దిగాయి.

పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నైజిరియన్లను తీసుకుని ఈ గుంపు వెళ్లిపోయింది. నార్కోటిక్ సెల్ దళం రాత్రి 2.30 ప్రాంతంలో నెబ్ సరాయ్‌లోని రాజు పార్క్ వద్దకు వెళ్లి, అక్రమంగా ఉంటున్న నైజిరియన్లను పట్టుకుంది. వీసాలు లేకుండానే ఉంటూ అక్రమకార్యకలాపాలకు దిగుతున్న నైజిరియన్లు ఇప్పుడు పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ నైజిరియన్లు దూకుడుగా వ్యవహరించడం, పోలీసులపై వీరు దాడికిదిగడం వంటి దృశ్యాలు సెల్‌ఫోన్ల ద్వారా సామాజికమాధ్యమాలకు వెళ్లాయి.

పరిస్థితిని సమీక్షించుకుని తెల్లవారుజామున తిరిగి పెద్ద ఎత్తున పోలీసు బృందాలు తరలిరావడం, అక్కడున్న నలుగురు నైజిరియన్లను తీసుకువెళ్లడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. నిర్బంధంలోకి తీసుకున్నవారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత దాదాపు 200 మంది నైజిరియన్లు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. నిర్బంధంలోని వారిని తప్పించి తీసుకువెళ్లేందుకు యత్నించారు. పోలీసు బలగాలు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అక్రమంగా ఉంటున్న నైజిరియన్లను, అక్రమ దందాలకు దిగుతున్న వారిని వారివారి దేశాలకు పంపించే చర్యలు వేగవంతం చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News