Sunday, December 22, 2024

మధ్యప్రదేశ్‌లో మరో అమానుషం..

- Advertisement -
- Advertisement -

గ్వాలియర్ : మధ్యప్రదేశ్‌లో మరో అమానుష ఘటన జరిగింది. గ్వాలియర్‌లో నడుస్తున్న కారులో ఓ వ్యక్తిని చితకబాదుతూ మరో వ్యక్తి పాదాలను నాకించిన ఘటన జరిగింది. సంబంధిత వికృత చర్యను తెలిపే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. ఈ రాష్ట్రంలోనే ఓ ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన జుగుప్సాకర ఘటన ఇప్పటికి కలుక్కు మన్పిస్తున్న దశలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్న కొందరు వ్యక్తులు కారువెళ్లుతుండగానే కొట్టారు. ఈ బాధిత యువకుడి తల అదిమి పట్టుకుని ఈ బృందంలోని వారు వారి కాళ్లను నాలుకతో తాకించారు. ఈ వ్యక్తిని చెప్పులతో తీవ్రంగా కొట్టడం, ఈ ఘటనను వెనుక నుంచి ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి సామాజిక మాధ్యమానికి దర్జాగా పంపించడం గురించి ఇప్పుడు పోలీసులు స్పందించారు.

ఈ ఘటనలో ఇప్పటికి ఇద్దరిని అరెస్టు చేసినట్లు గ్వాలియర్ పోలీసులు తెలిపారు. సంబంధిత ఘటన శుక్రవారం జరిగినట్లు , అమానుషానికి పాల్పడ్డవ్యక్తులు దబ్రా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వ్యక్తిపై ఈ దుండగులు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరించారు? అనే వివరాలను పోలీసులు తెలియచేయలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన విషయాన్ని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ తరువాత ధృవీకరించారు. బాధితుడు కూడా దబ్రా ప్రాంతం వ్యక్తే అని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు దబ్రా స్థానిక పోలీసు అధికారి వివేక్ కుమార్ శర్మ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అక్కడి అదనపు ఎస్‌పి రాజేశ్ దండోతియా చెప్పారు.

బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో పలు అమానుషాలు
కొద్దిరోజుల క్రితమే ఓ ఆదివాసి వ్యక్తిపై మూత్ర విసర్జన ఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ప్రవేష్ శుక్లా అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి ఇంటిని కూల్చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత యువకుడి కాళ్లు కడిగి, జరిగిన దానికి క్షమాపణలు తెలిపారు. ఇటీవలే ఇద్దరు దళితులను పట్టుకుని తీవ్రంగా కొట్టిన ఘటన శివ్‌పురి జిల్లాలో జరిగింది. ముస్లిం మహిళలు కొందరు వీరు తమను వేధిస్తున్నారని చెప్పడంతోనే స్థానికులు వీరిని చితకబాదారు. నిజాలు తెలుసుకోకుండానే వారి మెడలో చెప్పుల దండలేసి ఊరేగించి, బురద తిన్పించారు. ఈ బాధితుల గోడు గురించి ఇప్పటికీ విన్పించుకున్న దాఖలాలు లేకుండా పొయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News