పాట్నా: బీహార్‌లోని సీతామఢి జిల్ల పరిహార్ పోలీసు స్టేషన్ పరిధిలో ముస్లిం మతస్తులకు చెందిన అనేక ఇళ్లు, మసీదులపై మూకలు దాడి చేశాయి. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు 49 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లౌడ్ స్పీకర్ల వాడకంపై ఈ దాడులు జరిగినట్లు సీతామఢి పోలీసు స్టేషన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ఈ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా మూకలు దాడి చేశాయి.
డిఎస్‌పి సుబోధ్ కుమార్, సహా ఇన్‌స్పెక్టర్ దయాశంకర్ షా ఈ దాడులలో గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులతోపాటు క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాకాండ పునరావృతం కాకుండా నివారించేందుకు భారతీ స్థాయిలో పోలీసు సిబ్బందిని అక్కడ మోహరించారు. వీడియో సాక్ష్యాల ఆధారంగా ఇప్పటి వరకు 49 మందిని అరెస్టు చేశామని, పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు ట్వీట్ చేశారు. తప్పుడు వార్తలను, వీడియోలను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు.