తెలంగాణలో నిరుపేదలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సొంతింటి కల సాకారం కానుందని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని ఇందిరమ్మ ఇళ్లపై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేస్తూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా అర్హులను ఎంపిక చేయడానికి వీలుగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ యాప్‌ను సిఎం రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించనున్నారని ఆయన తెలిపారు. 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులే స్వయంగా ఊరురా వస్తారన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఇళ్ల పథకం అమలుకు ఉన్న అవరోధాలను అధిగమిస్తూ అమలుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేసిందని ఆయన తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని, ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ పేటెంట్ అని ఆయన తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి, ఏ తండాకు పోయినా, ఏమారుమూల ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇళ్లే కనబడతాయన్నారు. ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతు అయితే, తాము కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు అని ఆయన తెలిపారు. తాము గర్వంగా చెబుతున్నామని, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఇళ్లకు నాలుగు దశల్లో లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం, వంటగది, టాయిలెట్ సౌకర్యాలను కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్ధను రద్దుచేసి లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని, రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడతామమని మంత్రి ప్రకటించారు.