రైలులో లోకం తెలియని ప్రయాణం
నాసిక్ : సెల్‌ఫోన్‌లలో మొబైల్ గేమ్స్‌కు అలవాటుపడ్డ ఓ 12 ఏండ్ల బాబు నాందేడ్ నుంచి నాసిక్‌కు ఒంటరిగా రైలులో వెళ్లాడు. తమ అబ్బాయి ఇంటికి రాకపోవడంతో రాహేర్ గ్రామానికి చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన బాలుడి కేసును నమోదు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వే పోలీసు బృందాలను అలర్ట్ చేశారు. బాబు ఫోటోలు, గుర్తులను అన్ని ఠాణాలకు పంపించారు. నాందేడ్ నుంచి నాసిక్ వైపు వెళ్లే రైళ్లన్నింటి నుంచి దిగే ప్రయాణికులను , ప్రత్యేకించి పిల్లలను నిలిపివేసి తరువాతనే వారిని బయటకు వదిలారు.ఈ లోగా ఈ నాందేడ్ బాలుడు పోలీసులను చూడగానే తప్పించుకోవడానికి, ముఖం కనబడకుండా ఉండటానికి యత్నించినా పోలీసు కానిస్టేబుల్ విజయ్ కపిలే ఈ బాబును కనుగొన్నాడు. ఈ బాబు తపోవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కి టికెట్ లేకుండా నాసిక్ వరకూ వచ్చాడు. విషయాన్ని పోలీసులు నాందేడ్ పోలీసులకు తెలిపారు. తండ్రి అక్కడికి వచ్చి బాబును ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ బాబుకు తరచూ మొబైల్ గేమ్స్ ఆడటం అలవాటు అయింది. ఈ క్రమంలోనే గేమ్స్ ఆడుతూ రైలులో కూర్చుని ఏమీ గమనించకుండా నాసిక్ వరకూ చేరాడని వెల్లడైంది. ఈ బాబు ఫ్రీ ఫైర్ వంటి సెల్‌ఫోన్ గేమ్స్‌కు అలవాటుపడ్డారని తరువాతి విచారణల్లో తేలింది.