Saturday, January 25, 2025

మానసిక ఆరోగ్యంపై ‘సెల్‌ఫోన్’ దెబ్బ

- Advertisement -
- Advertisement -

అరచేతిలో ఇమిడే విజ్ఞాన సర్వస్వం ‘స్మార్ట్ ఫోన్’. బాల్యాన్ని అథఃపాతాళానికి తొక్కుతున్నదీ ఇదే స్మార్ట్ ఫోన్. పదేళ్ల వయసులో స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఉపయోగిస్తున్న బాలబాలికలు సగం మంది యుక్తవయసుకు వచ్చేసరికి వివిధ రకాల మానసిక రుగ్మతల బారినపడుతున్నారు. విద్యార్థుల ఏకాగ్రతను, చదువును, సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. బంగారు భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ఉచ్చులో చిక్కుకోవడం సభ్య సమాజాన్ని కలచివేస్తోంది. పిల్లలకు డిజిటల్ పరిజ్ఞానం పెరుగుతుందని, ఆన్‌లైన్‌లో నేర్చుకుంటారని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెల్‌లను చేతికిస్తే… భవిష్యత్తులో మానసిక సమస్యల బారినపడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా అనంతరం పిల్లల అలవాట్లు, మానసిక ప్రవర్తనల్లో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. పాఠశాలలు దీర్ఘకాలం మూతపడటంతో టివి, ట్యాబ్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాలు, సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, ఆన్‌లైన్ గెవ్‌ుషోలు వారికి వినోద సాధనాలు, కాలక్షేప వేదికలుగా మారాయి. కొంతమంది పిల్లలు వినోదం మాటున అశ్లీల, హింసాత్మక దృశ్యాలు చూడటం ద్వారా దారి తప్పుతున్నారు. వీటన్నింటి ప్రభావంతో బాలల్లో దూకుడు, అవాంఛనీయ నిర్ణయాలు, అసంకల్పిత ఆలోచనలు మితిమీరుతున్నాయి. ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన, చికాకు పెరిగిపోతున్నాయి. చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తున్నారు. విచక్షణ కోల్పోయి హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగి, నేరస్థులుగా మారుతున్నారు. కన్నతల్లిని హతమార్చడం, యువకుడిని ముగ్గురు పిల్లలు కలిసి చంపడం, ఓ బాలుడి ఆత్మహత్య, మతిస్థిమితం కోల్పోవడం, దొంగతనానికి పాల్పడటం వంటి సంఘటనల వెనుక ప్రధాన సూత్రధారి స్మార్ట్ ఫోన్. బాల్యంలోనే స్మార్ట్ ఫోన్‌ను అందుకున్నవారు, యుక్త వయసుకు వచ్చాక ఆత్మహత్య ఆలోచనలు పెరగడం, ఇతరుల పట్ల దూకుడుగా వ్యవహరించడం, వాస్తవికత నుంచి దూరంగా పలు రకాల భ్రాంతులకు గురికావడం వంటి సంఘటనలు ఏయేటి కాయేడు పెరుగతున్నట్లు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. మన దేశంతో సహా 40 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ఊహ తెలియని ఆరేళ్ల వయసులోనే బాలికలు స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడం ప్రారంభించిన 74% మంది తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇక పదేళ్ల వయసులో మొదటి స్మార్ట్ ఫోన్ అందుకున్నవారిలో 61% మంది, పదిహేనేళ్లకు వాడటం మొదటిపెట్టినవారిలో 52% మంది మానసిక దుష్ర్పభావాలకు లోనయినట్లు గుర్తించారు. ఇక బాలుర విషయానికొస్తే, ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, ఆరేళ్ల వయసులో స్మార్ట్ ఫోన్‌ను వాడటం మొదలుపెట్టిన వారిలో 42%, 18 ఏళ్లలో ఇది 36% ఉంది. స్మార్ట్‌ఫోన్ విప్లవానికి ముందు పిల్లలు చాలా సమయం కుటుంబంతో, స్నేహితులతో గడిపేవారు. ఇప్పుడీ పరిస్థితి లేదు. సమాజంలో తమ భాగస్వామ్యానికి తగినట్లుగా సాధన లేకపోవడం, తోటివారితో కలవకపోవడంతో ప్రవర్తన తీరు సంక్లిష్టంగా మారుతోంది. డిజిటల్ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలు, సినిమాలు, గేవ్‌ుషోలు, వెబ్ సిరీస్ తదితరాలకు బానిసలుగా మారుతుండటంతో పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. వారు నేరస్థులుగా మారడానికి కారణమవుతున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. 13 ఏళ్ల వయస్సు నుంచే పిల్లలు సొంతంగా సెల్ ఫోన్ కొనుక్కుంటున్నారని, 917 ఏళ్ల వయసు పిల్లల్లో 30% మేరకు సొంత ఫోన్లు ఉన్నాయని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) అధ్యయనం తేల్చింది. ఈ వయసు పిల్లల్లో 43% ఇన్‌స్టాగ్రావ్‌ు, 37%పైగా ఫేస్‌బుక్ ఖాతాలు కలిగి ఉన్నారని గుర్తించింది. 810 వయసు పిల్లలు సగటున రోజుకు ఎనిమిది గంటలు, కౌమర దశ చిన్నారులు 11 గంటల దాకా ఎలక్ట్రానిక్ తెరలతో గడుపుతున్నట్లు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. టీనేజ్ పిల్లల్లో ఇదివరకు ఏడు నుంచి ఎనిమిది శాతం మధ్య ఉన్న మానసిక సమస్యలు కరోనా అనంతరం 15 శాతానికి పెరిగినట్లు బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నివ్‌ుహాన్స్) పరిశీలనలో తేలింది. ఇందుకు భిన్నంగా పీయర్సన్స్ గ్లోబల్ లెర్నర్స్ సంస్థ చేపట్టిన సర్వే ఉంది. చిన్నారుల మానసిక ఆరోగ్యానికి సామాజిక మాధ్యమాలు, వీడియో గేవ్‌ులు దోహదం చేస్తున్నాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. వీడియో గేవ్‌ులతో మంచి జరుగుతుందని 40% మంది, సామాజిక మాధ్యమాలతో మానసికంగా ఎదుగుతారని 30% మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ విద్యాబోధన పట్ల కూడా 27% మంది తల్లిదండ్రులు సానుకూలత వ్యక్తపరిచారు. పాఠశాలల్లో తమ పిల్లలకు, సిబ్బందికి ఉచితంగా మానసిక ఆరోగ్య సేవలను అందించాలని ప్రపంచవ్యాప్తంగా 92% మంది తల్లిదండ్రులు భావించారు. ప్రాథమిక విద్యా దశలోనే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తే బాగుంటుందని 53% మంది తల్లిదండ్రులు అనుకుంటున్నారని సర్వే తెలిపింది. తమ పిల్లల మానసిక ఆరోగ్య సంబంధ విషయాల గురించి ఉపాధ్యాయులు తమతో చర్చిస్తుంటారని 26% మంది తెలిపారు. కొత్త కొత్త యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్న ఆధునిక సమాజం, అదే స్థాయిలో మనుషులకు సవాల్ విసురుతున్నాయి. సెల్ ఫోన్ చెరలో నేడు పిల్లలు విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం బాధ కలిగించే విషయం. చేతిలో పాఠ్యపుస్తకం ఉండాల్సిందిపోయి సెల్‌ఫోన్ చేరింది. జనాభాలో ఎనభై శాతం పైగా దీనిని వాడుతున్నారు. తరగతి గదిలో గురువు చెప్పే అంశాలపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయి నిత్యం సెల్ ఫోన్‌పై దృష్టి పెట్టి విలువైన సమయం వృథా చేస్తున్నారనేది పరిశోధకుల అభిప్రాయం. సెల్‌ఫోన్ విద్యార్థులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. దీనివల్ల దృష్టి మందగించడం, ఆందోళన కలగటం, నిద్రాభంగం, అనైతిక కార్యకలాపాలు తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది. అంతేకాక ‘నోమోపోభియా’ అనే మానసిక వ్యాధికి గురవుతున్నారని వైద్యులు సూచించటం ఆలోచించాల్సిన విషయం. మనిషి జీవితంలో అత్యంత క్రియశీలక పాత్ర పోషించే ‘టీనేజ్’ దశ లో పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. శారీరక, మానసిక మార్పులను పసిగట్టాలి. లోపాలు, అసహజమైన పద్ధతుల్లో వారి ప్రవర్తన ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సక్రమ మార్గంలో నడిచేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. క్రియాశీలక భవిష్యత్తుకు ఆటంకం కల్పించే సెల్‌ఫోన్ పట్ల జాగరూకత లేకపోతే భవిష్యత్తుకు విఘాతం కలిగే అవకాశముంటుందని గుర్తించాలి.

కోడం పవన్‌కుమార్
98489 92825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News