కేంద్రం అనుమతి… ఖర్చు రూ 6466 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో సరికొత్తగా అదనంగా 7287 గ్రామాలకు మొబైల్ ఫోన్ల సేవలను అందించనున్నారు. ఇప్పటివరకూ సెల్‌నెట్‌వర్క్‌ల పరిధిలోకి రాకుండా ఉన్న ఈ గ్రామాలకు సేవలను వర్తింపచేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ అదనపు గ్రామాల సెల్‌సేవల విస్తరణకు ఐదేళ్లలో రూ 6466 కోట్లు వ్యయం అవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. మారుమూల ప్రాంతాలకు కూడా సమాచార విస్తరణ, స్థానికులకు ఫోన్ల కమ్యూనికేషన్‌ను మరింతగా చేరువ చేసేందుకు ఈ గ్రామాలను సేవల పరిధిలోకి తీసుకువచ్చారు.
కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషాలలోని దాదాపు 44 జిల్లాల్లో ఇప్పటివరకూ సెల్ సౌకర్యం అందుబాటులో లేని గ్రామాలను గుర్తించారు. వీటిని నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఐదేళ్ల కాల పరిమితి కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నట్లు వివరించారు. ఈ గ్రామాలకు 4 జి ప్రాతిపదిక సెల్‌సేవలు విస్తరణ క్రమంలో అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు మెరుగైన ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఆయా గ్రామాలలో టెలికం టవర్స్, సేవలు ఏర్పాటు జరుగుతుంది.