ఇబ్యాలెట్ పరిశోధనల్లో పురోగతి
సిఇసి సునీల్ అరోరా
న్యూఢిల్లీ: రిమోట్ ఓటింగ్ విధానాన్ని తీసుకురావడానికి త్వరలో మాక్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్‌అరోరా తెలిపారు. సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కట్టింగ్ ఎడ్జ్ టెన్నాలజీతో రిమోట్ ఓటింగ్‌పై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. ఈ పరిశోధనల్లో ఆశాజనక పురోగతి లభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఐఐటి మద్రాస్‌తో కలిసి ఎన్నికల కమిషన్ పని చేస్తోందని అరోరా తెలిపారు. రిమోట్ ఓటింగ్ అందుబాటులోకి వస్తే పోలింగ్ సమయంలో దూరప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలవుతుంది.
బయోమెట్రిక్ పరికరాలు, వెబ్ కెమెరాలులాంటి సాంకేతికతను ఉపయోగించి ఈ రిమోట్ ఓటింగ్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్టు ఎన్నికల కమిషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ సందీప్‌సక్సేనా గతంలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోదలిచిన ఓటర్లు ముందుగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానమైన ఇబ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఇలాంటి ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని పోటీ చేసిన అభ్యర్థులకు తెలియజేయడం జరుగుతుంది. అయితే, ఎవరికి ఓటు వేసింది తెలియకుండా ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. లెక్కింపునకు ముందు ఈ ఓట్లు సురక్షితమైనవేనా..? అన్నది కూడా పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.