మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొన్నిరోజులుగా సూర్యుడి తాపానికి గురవుతున్న ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. రాగల రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, -దక్షిణ ద్రోణి ఒకటి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సుమారు 900 మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురవగా జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.