రానున్న మూడురోజులు పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
0.9కిలోమీటర్ల ఎత్తులో….
తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5కిలోమీటర్లు వద్ద కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
శంకర్‌పల్లి, వికారాబాద్‌లో
శంకర్‌పల్లి, వికారాబాద్‌లో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్పటివరకు సూర్యుని ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి చేసిన ప్రకృతి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం విపరీతమైన గాలులు వీస్తూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సుమారు అర్ధగంట సేపు వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ప్రజలు, రైతులు, వినియోగదారులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. వేసవి కాలం ఎండలు మండుతున్న ప్రస్తుత సమయంలో వర్షం కురవటంతో ఆనందం వ్యక్తం చేశారు.