మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఏప్రిల్ 18వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడి వాన పడిందని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవగా, లింగాల మండలంలో భారీ వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి. లింగాలలో ఇంటిపై ఉన్న రేకుల షెడ్డు గాలివానకు ధ్వంసమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.