భారత ప్రధాన న్యాయమూర్తి ఉవాచ
న్యూఢిల్లీ: ‘ఆధునిక విద్యావిధానం కేవలం ప్రయోజనకరమైన విషయాలపైనే దృష్టి పెడుతుంది, కానీ నైతిక లేక ఆధ్యాత్మిక శీలాన్ని పెంచేందుకు అందులో పసలేదు’ అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సోమవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి ఇనిస్టిట్యూట్ ఫర్ హయ్యర్ లెర్నింగ్ 40వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. “అసలైన విద్య నైతిక విలువలు, మానవతా విలువలు, క్రమశిక్షణ, నిస్వార్ధపరత్వం, సానుభూతి, సహనం, క్షమాగుణం, పరస్పర మర్యాద వంటివి నేర్పిస్తుంది. విద్య అనేది మీ శీలాన్ని పెంచేదిగా ఉండాలి, మీ ఆలోచనా శైలిని పెంచేదిగా ఉండాలి. జీవితంలో అయోమయ పరిస్థితి ఎదురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకునేలా విద్య మిమ్మల్ని తయారుచేసేదిగా ఉండాలి” అని కూడా ఆయన తెలిపారు. “అసలైన విద్య ఆచరణరీత్యా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి. సకారాత్మక మార్పును తేవాలి” అన్నారు. సత్య సాయి విద్యా సంస్థలను అరుదైన విద్యా సంస్థ అని, ఇందులో ప్రాపంచిక విద్యతో పాటు, ఆధ్యాత్మిక విద్యను కూడా అందించడం జరుగుతుంది’ అని ఆయన ప్రశంసించారు.