అమెరికా ఎల్‌జెఐ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
వాషింగ్టన్ : మోడెర్నా కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏర్పడే వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యునిటీ )కనీసం ఆరు నెలల వరకైనా ఉంటుందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బూస్టర్ అవసరమనడానికి తగిన సంకేతాలు ఏవీ కనిపించడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికా లోని లా జొల్లా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇమ్యునాలజీ (ఎల్‌జెఐ) కి చెందిన పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు జర్నల్ సైన్స్‌లో వెల్లడయ్యాయి. అసలు ఇమ్యూనిటీ ఏర్పడడానికి ఆరు నెలల సమయం చాలా కీలకమని పరిశోధకులు స్పష్టం చేశారు.
70 ఏళ్లు దాటిన వయోవృద్ధులతోపాటు తీవ్రంగా కొవిడ్ బాధితులైన వారిలో కూడా వైరస్‌ను నిరోధించే ఇమ్యూనిటీ స్థిరంగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్లకు ఈ సామర్ధం ఉండడం మంచి సంకేతమని ఎల్‌జెఐ ప్రొఫెసర్ షేన్ క్రాటీ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్‌లో 25 మైక్రోగ్రాముల వ్యాక్సిన్ డోసు పొందిన వారితో కోలుకున్న కొవిడ్ రోగులను పోల్చి అధ్యయనం చేశారు. ఈ చిన్నపాటి డోసు కూడా అత్యంత శక్తివంతంగా పనిచేసినట్టు రుజువైందని ఎల్‌జెఐ పరిశోధకులు జోస్ మేత్యూస్ ట్రివినో వివరించారు.