గాంధీనగర్ : దేశం లోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామంగా గుజరాత్, మెహసానా జిల్లా లోని మొధేరా గ్రామాన్ని ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామం గానే మొధేరా దేశానికి తెలుసని, ఇకమీదట సౌరవిద్యుత్ గ్రామంగా దేశ ప్రజలంతా గుర్తిస్తారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని మరింత ప్రోత్సహించడం ద్వారా ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మారడమే లక్షంగా పనిచేయాలని సూచించారు. మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారని, కానీ ఇప్పటితరానికి ఆ బాధల్లేవని చెప్పారు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం , అనుసంధానితను పెంచడం వంటివి ప్రస్తుత ప్రభుత్వ పాలన అందిస్తోందని పేర్కొన్నారు. ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్ కార్లు, మెట్రోకోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.