ముంబయి: క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ వ్యవస్థకు ఉందని ప్రధాని మోడీ గురువారం ‘ద సిడ్నీ డైలాగ్’ అనే వర్చువల్ సదస్సులో అన్నారు. “తప్పుడు వ్యక్తుల చేతుల్లో క్రిప్టోకరెన్సీలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య దేశాలకు ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే అది యువతను చెడగొడుతుంది” అని మోడీ తన ప్రారంభోపన్యాసంలో తెలిపారు. సిడ్నీ డైలాగ్ అనేది సైబర్ వార్షిక సదస్సు. ప్రపంచ శాంతిభద్రతల విషయంలో డిజిటల్ డొమెయిన్ కీలక టెక్నాలజీల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడుదారులు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందని, ఇక డిజిటల్ విప్లవ ఫలాలను వ్యవసాయం అందుకుంటోందని మోడీ అన్నారు. భారత్ డిజిటల్ విప్లవంలో పురోగమిస్తోందని, వ్యక్తిగత హక్కుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. డిజిటల్ డొమెయిన్‌లో భారత్ ఐదింతల మార్పులు చూస్తోందన్నారు.